ఢిల్లీ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జే షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నమాన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ రంగంలో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇదే క్రమంలో తాను బీసీసీఐలో ఉన్నప్పుడు 2028 వరకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని అన్నారు . అదృష్టవశాత్తు మేము మంచి ఫలితాలను సాధించినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు, ఇక్కడ సమావేశమై ఉన్న బీసీసీఐ బృందం భవిష్యత్తు వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
రాబోయే 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఐసీసీ చైర్మన్. 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్ కోసం మీరు సిద్ధం కావాలన్నారు జే షా. అంతేకాకుండా 2037లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయో మీ అందరికీ తెలిసే ఉంటుందన్నారు. మీరు దాని కోసం కూడా సన్నద్ధతను ప్రారంభించాలని ఎక్కడా నిర్లక్ష్యం వహించ కూడదని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క జట్టుపై ఐసీసీ ఆధారపడి పని చేయదని కుండ బద్దలు కొట్టారు జే షా.
