విజయవాడ : బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా వంద మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 700ల మంది పాల్గొనగా, వారిలో వంద మంది అర్హత సాధించారన్నారు. మహిళ, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పించామన్నారు సవిత. హైదరాబాద్ కు చెందిన లా ఎక్స్ లెన్స్ ఐఎఎస్ అకాడమీ ద్వారా నిష్ణాతులైన అధ్యాపకులతో సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నామన్నారు. కార్పొరేట్ సంస్థల కంటే ధీటుగా పౌష్టికాహారంతో కూడిన విద్యా బోధన జరుగుతోందని చెప్పారు సవిత.
ఏసీ తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ వంటి అధునాతన సదుపాయలు కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా వివిధ సబ్జెక్టులతో కూడిన మెటీరియల్ ను అభ్యర్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని, బీసీ అభ్యర్థులు ఐఎఎస్ లుగా ఎంపికవ్వాలని మంత్రి సవిత సూచించారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని, ఈ పోటీ పరీక్షకు కూడా ఉచిత కోచింగ్ అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి సవిత ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుని, ఐఎఎస్ లు స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఎం.ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















