Bathukamma : హైదరాబాద్ : బతుకమ్మకుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు నేడు జీవం పోసుకుంది. ముళ్ల పొదలు.. పిచ్చి మొక్కలతో అటువైపు చూడాలంటేనే భయపడే విధంగా ఉన్న బతుకమ్మ కుంట (Bathukamma) నేడు జలకళతో చూడముచ్చటగా తయారైంది. కబ్జాల చెరను విడిపించుకుని కనువిందు చేస్తోంది. ఆక్రమణల నుంచి బయట పడి ఆహ్లాదంగా మారింది. ఇలా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇదంతా హైడ్రా చొరవతోనే సాధ్యమైందని అక్కడి నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా మారిన చెరువును చూసి ఇది కలా.. నిజమా అని సంబర పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పానికి, హైడ్రా పని తీరుకు బతుకమ్మ కుంట నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు. ఇవాళ ప్రారంభానికి నోచుకోనుంది.
Bathukamma Kunta
జలకళతో జీవ వైవిధ్యంతో.. చక్కటి పర్యావరణంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించేలా ఈ నగరాన్ని తీర్చి దిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికై ఎలా ముందుకు వెళ్లాలి అని ఆలోచించే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తట్టిన ఆలోచనే హైడ్రా. జులై 19వ తేదీ 2024లో హైడ్రా ఆవిర్భవించింది. ఆరంభం నుంచే తన మార్కును చాటుతూ నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మ కుంట ప్రేరణగా నిలిచింది. వరద నివారణకు బతుకమ్మకుంట బాటలు వేసింది. నగర వ్యాప్తంగా చెరువులు అభివృద్ధి చెందితే వరదలు చాలావరకు నివారించవచ్చునని బతుకమ్మకుంట నిరూపించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్తె తెలిపారు. వర్షం పడితే బతుకమ్మకుంట పరిసరాలు నీట మునిగేవి. ఈ వర్షాకాలంలో బతుకమ్మ కుంటలోకి వరద నీరు చేరడంతో ముంపు సమస్య తప్పింది. కేవలం 5 నెలల్లో బతుకమ్మకుంటను రూపొందింమని చెప్పారు. ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాలక్రమంలో బతుకమ్మ కుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందన్నారు.
Also Read : Intel Strong Focus : పెట్టుబడుల భాగస్వామ్యం కోసం ఇంటెల్ ఫోకస్
