హైదరాబాద్ : ఎలినినో ప్రభావం కారణంగా నీటిని పొదుపుగా వాడు కోవాలని ఇదే క్రమంలో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. ఎల్ నినో ప్రభావం, నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయసాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా సీజనల్ పరిస్థితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
అంచనా వేయబడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల (కాంటింజెన్సీ క్రాప్) ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) అవసరాన్ని చెబుతూ తక్కువ నీటి అవసరం ఉండే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను సాగు చేసేలా రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.
ఈ నెల 30వ తేదీన జరగనున్న NEET-PG ప్రవేశ పరీక్ష సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లాల్లో చేపడుతున్న ఏర్పాట్లను సీఎస్ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 30 సెంటర్లలో ఈ పరీక్ష జరగనున్నందున కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
