యుఎల్‌సి చ‌ట్టంపై విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం

తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

hellotelugu-UrbanLandcieling

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం ( అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ – యుఎల్‌సి) కి సంబంధించి కొద్దిరోజుల్లో ప్ర‌భుత్వం విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. గత ప్రభుత్వ హయాంలో CS-7, CS-14కు సంబంధించి 2017లో అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌త్రిక ఎండి ఒక భూస్వామి నుంచి ఎస్ క్లాస్ బెంజి కారు తీసుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ 5 డాక్యుమెంట్ల ద్వారా 811 ఎక‌రాల భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న అంశంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోరితే సెట్ ద‌ర్యాప్తున‌కు ఆదేశిస్తామ‌ని చెప్పారు పొంగులేటి.

రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాల్లో యుఎల్‌సి క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యలను మంత్రి వివరించారు. యుఎల్‌సి క్లియర్ చేసుకున్న భూములకు సంబంధించిన జీఓలు, ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. యుఎల్‌సికి దరఖాస్తు చేయని లేదా క్లియరెన్స్ పొందని భూములు నిషేధిత జాబితాలో ఉండటం సహజమేనని చెప్పారు. యుఎల్‌సి క్లియర్ చేసుకున్న వారికి ఇబ్బంది లేదన్నారు. అవసరమైన పత్రాలు అందిస్తే ప్రభుత్వం పరిశీలించి క్లియర్ చేస్తుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కానీ యుఎల్‌సి కూడా చేయించు కోకుండా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ ప్రచారం చేయడం సరికాదని మండిప‌డ్డారు.

ప్ర‌తిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు 22ఏపై కావాల‌ని రాద్దాంతం చేస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం వ‌ల్ల‌నే నిషేధిత జాబితాలో భూములు ఉంచ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై ఎందుకు లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. త‌మ స‌ర్కార్ పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

Exit mobile version