గుంత‌క‌ల్ – బ‌ళ్లారి మ‌ధ్య నాలుగు లైన్ల ఏర్పాటుకు ఓకే

ఆనందం వ్య‌క్తం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-GuntakalBallariRailwayLine

అమరావతి : కేంద్రంలోని మోదీ బీజేపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది ఏపీ స‌ర్కార్ కు. ఈ మేర‌కు శ‌నివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గుంతకల్ – బళ్లారి మధ్య 3, 4 రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్బంగా ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర‌ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గుంతకల్ – బళ్లారి మధ్య 3వ & 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా రూ.1,264 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మొత్తం పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ ప్రాజెక్టుతో దేశంలోనే కీలకమైన ‘తూర్పు – పడమర’ రైల్వే కారిడార్ మరింత బలోపేతమయ్యేందుకు ఈ రైల్వే లైన్లు ఉపయోగపడతాయ‌ని కేంద్రం తెలిపింది.

ఈ రైల్వే లైన్ల వల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని స్ప‌ష్టం చేసింది. కొత్త రైల్వే లైన్ల ద్వారా పారిశ్రామిక వృద్ధి పెరిగి, సరికొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటి లభిస్తుందన్నారు. రైల్వే నెట్‌వర్క్‌పై రద్దీ తగ్గి.. ప్రయాణికులు, సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుంద‌ని పేర్కొన్నారు సీఎం. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తూ ఏపీ అభివృద్ధికి మద్దతిస్తున్న కేంద్రానికి ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సీఎం.

Exit mobile version