విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పై కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తమ పార్టీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఈ పథకం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తూ మౌనంగా ఉండడం దారుణమన్నారు షర్మిలా రెడ్డి. ‘జీ రామ్ జీ’ చట్టంతో రాష్ట్రంపై రూ.4,500 కోట్ల భారం పడుతుందని అన్నారు.
మోదీ చేతిలో చంద్రబాబు తోలుబొమ్మలా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు . కొత్త చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వంపైనా, కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బీజేపీ తెస్తున్న నల్ల చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఊతమిచ్చిందని అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలి జాబ్ కార్డును మన రాష్ట్రంలోనే అందించామన్నారు. ఈ పథకం ద్వారా ఏటా 80 లక్షల మంది పేదలకు ఉపాధి హక్కుగా మారిందని అన్నారు.

















