Ayyannapatrudu : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు (Ayyannapatrudu) అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బార్బడోస్ లో జరగనున్న 68 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ) లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందుకున్నారు. ఆయన సోమవారం ఢిల్లీ నుంచి లండన్ మీదుగా బార్బడోస్ కు బయలు దేరనున్నారు. అయ్యన్న పాత్రుడు సీపీఏ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ ప్రతినిధిగా పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కూడా స్పీకర్ వెంట వెళ్లనున్నారు.
AP Speaker Ayyannapatrudu Comments
కామన్వెల్త్ దేశాలలోని చట్ట సభల సభాపతులకు తమ తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడానికి, చట్ట సభలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమకాలీన సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడానికి సీపీసీ ఒక విశ్య వేదికగా అవతరించనుంది. 69వ సీపీసీని బార్బడోస్ పార్లమెంట్, సీపీఏ బార్బడోస్ బ్రాంచ్ నిర్వహిస్తున్నాయి.
సీపీసీ అనేది కామన్వెల్త్ పార్లమెంటరీవేత్తల అతిపెద్ద సమావేశం, 68వ సీపీసీకి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) లో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు, రాష్ట్రాల నుండి సభాపతులు, పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ సిబ్బంది హాజరవుతారు. సీపీఏ అనేది జాతీయ, రాష్ట్ర, ప్రాదేశిక చట్ట సభలను ఒకే వేదిక మీదకు తెచ్చే ఏకైక పార్లమెంటరీ సంఘం. సీపీఏ లో కామన్వెల్త్ దేశాలకు చెందిన దాదాపు 180 పార్లమెంటులు, శాసన వ్యవస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధి వర్గానికి లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వం వహిస్తారు.
