AP Rains : అమరావతి – ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఏపీ (AP), కర్ణాటకలోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. అన్ని ప్రాజెక్టులు కళ కళ లాడుతున్నాయి. ఇదిలా ఉండగా గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద కొంచెం తగ్గుముఖం పట్టినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
AP Rains Update
భద్రాచలం వద్ద నీటిమట్టం 30.6 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఉదయం 6 గంటలకు వరద ప్రవాహం 6.72 లక్షల క్యూసెక్కులు ఉండగా సాయంత్రం 7 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.28 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నెంబర్లు సంప్రదించాలని కోరారు.
గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని ప్రఖర్ జైన్ సూచించారు.
Also Read : Nerella Sarada Interesting Comments : బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మకం















