విజయవాడ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె జగన్ రెడ్డిని ఏకి పారేశారు. విజయవాడలో ఆదివారం సవిత మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచి పోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఆరోపించారు. జగన్ చేసిన తప్పిదాలను తన సొంత నీలి మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడును బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణ రాష్ట్ర అధికార, విపక్షాలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 2020లో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణం చేపడుతున్నామని జగన్ ప్రభుత్వం అట్టాహాసంగా ప్రకటించిందన్నారు.
ఈ ప్రకటనపై ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో, కేంద్రంతో పాటు ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాయన్నారు. ఇదే విషయంపై అప్పట్లో మీడియాలోనూ ప్రచురితమైన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇపుడా తప్పిదాన్ని మభ్య పెడుతూ, తెలంగాణ సీఎం పేరుతో ఆయన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చేసిన తప్పు చేసి కప్పిపెట్టి, తమ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. విషపు రాతలు మానుకోకుంటే, జగన్ కు ప్రజలే మరింత గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రాయలసీమ ద్రోహి జగన్ అని, తన రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటేనని మంత్రి సవిత విమర్శించారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం నియోజక వర్గానికి హంద్రీ-నీవా కాలువకు జగన్ నీటిని విడుదల చేస్తున్నట్లు ఒక డ్రామా ఆడారన్నారు. సినిమా సెట్టింగ్ మాదిరిగా ఓ గేటు పెట్టి… దాన్ని ఎత్తుతున్నట్లు మీడియా ముందు జగన్ హడావుడి చేశారన్నారు. ఆరోజు సాయింత్రానికి అదంతా ఒట్టి మోసమని తెలిపోయిందన్నారు.















