ఇంకా భ్ర‌మ‌ల్లోనే బ‌తుకుతున్న జ‌గ‌న్ రెడ్డి : ఎస్. స‌విత‌

బీసీ సంక్షేమ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్

hellotelugu-MinissterSSavitha

మంగ‌ళ‌గిరి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. ప్రజలను ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించి ‘డైవర్షన్’ రాజకీయం చేయాలని ఆయన చూస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలే ఆయన్ను రాజకీయాల నుండి డైవర్షన్ చేసి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చేస్తున్న ఆరోప‌ణలు అన్నీ పచ్చి అబద్ధాలేన‌ని అన్నారు. మీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో పీపీపీ మోడల్‌కు మద్దతు తెలుపుతూ సంతకాలు పెడతారని, కానీ మీరు మాత్రం ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారా అని నిల‌దీశారు ఎస్. స‌విత‌. పీపీపీ మోడల్ ద్వారా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఈరోజు ప్రజలందరికీ క్లారిటీ ఉందన్నారు.

గతంలో కోడికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలతో ప్రజలను నమ్మించవచ్చని భావించారని మండిప‌డ్్డారు. కానీ ఇప్పుడు ఆ డ్రామాలు చెల్ల‌వ‌న్నారు. ఇప్పుడు మళ్ళీ ‘కోటి సంతకాలు’ అంటూ కొత్త నాటకానికి తెరలేపారంటూ ఎద్దేవా చేశారు ఎస్. స‌విత‌. గతంలో మిమ్మల్ని నమ్మి మోసపోయామని గ్రహించిన ప్రజలు, ఈసారి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్ మాటల్లో వాస్తవం లేదని విమర్శించారు. 17 కాలేజీలు తెచ్చానని చెప్పుకుంటున్న జగన్ , వాటి కోసం రాష్ట్రం నుండి పెట్టిన పెట్టుబడి సున్నా మాత్ర‌మేన‌ని అన్నారు. ఖర్చు పెట్టిన రూ.1550 కోట్లు కూడా కేంద్ర నిధులేన‌ని స్ప‌ష్టం చేశారు. కాలేజీలు ఏ దశలో ఉన్నాయి? మీరు చేసిన ఖర్చు ఎంత? అనే విషయాలపై ఆరోగ్య శాఖ మంత్రి త్వరలోనే లెక్కలతో సహా మీ ముసుగు తొలగిస్తారని అన్నారు.

Exit mobile version