వాషింగ్టన్ : మెటా ఏది చేసినా అది పెను సంచలనమే. తాజాగా తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకించి మెటా మ్యూజ్ చార్మ్ పేరుతో గ్యాడ్జెట్ ను తీసుకు వస్తున్నట్లు సంస్థ సీఈఓ, చైర్మన్ మార్క్ జుకర్ బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఎలా ఉంటుందోనని ఉత్కంఠ కొనుగోలుదారులలో ఏర్పడింది. అయితే సోషల్ మీడియా వేదికగా దీని ధర ఎంత ఉంటుదనే దానిపై చర్చలు మొదలయ్యాయి. మెటా సంస్థ తీసుకు రానున్న కొత్త ‘మ్యూజ్ చార్మ్’ ధర సుమారు 300 డాలర్లు ఉండవచ్చు అని అంచనా. ఇది జేబులో పట్టేంత చిన్న ఏఐ సహాయక పరికరం . దీనితో పాటు ఏడాది వరకు ఉచిత 5జీ డేటా లభించే అవకాశం ఉంది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ‘మ్యూజ్ చార్మ్’ అనే కొత్త పాకెట్-సైజ్ పరికరంతో ప్రత్యేక ఏఐ హార్డ్‌వేర్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్లో విడుదల కానున్న ఈ పరికరం ధర ,ఇతర ఆకర్షణీయమైన అంశాల గురించి ఒక నివేదిక వెల్లడైంది. ‘
ది ఇన్ఫర్మేషన్ కథనం ప్రకారం అమెరికాలో ‘మ్యూజ్ చార్మ్’ ధరను 300 డాలర్లుగా అంటే సుమారు 28,000 రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉంది. అంతే కాకుండా అమెరికన్ టెలికాం సంస్థ ‘వెరిజోన్’ ద్వారా 12 నెలల పాటు ఉచిత 5G డేటా కూడా లభించవచ్చు. ఈ పరికరంలో అంతర్నిర్మిత 5G మోడెమ్ ఉండటం ఒక ప్రత్యేకత. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌తో సంబంధం లేకుండానే మెటా ఏఐ అసిస్టెంట్ పని చేస్తుంది. కాగా ఈ గ్యాడ్జెట్ గురించి కంపెనీ ఇంకా ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. మ్యూజ్ చార్మ్ స్మార్ట్ పరికరంలా కాకుండా వినియోగదారులకు తమ ఫోన్లను బయటకు తీయాల్సిన అవసరం లేకుండానే ఏఐ అసిస్టెంట్‌ను త్వరగా యాక్సెస్ చేసేలా రూపొందించారు. ఇది చూడటానికి ‘ఎయిర్‌పాడ్స్’ ఛార్జింగ్ కేస్ లాగా ఉంటుంది; జేబులో పెట్టుకోవడానికి లేదా కీచైన్‌కు తగిలించు కోవడానికి వీలుగా చాలా చిన్నదిగా ఉంటుంది.
ఇందులో సుమారు రెండు అంగుళాల టచ్‌స్క్రీన్, స్పీకర్లు, మైక్రోఫోన్లు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు వాయిస్ కమాండ్ల ద్వారా మెటా మ్యూజ్ చైర్ ఏఐతో సంభాషించవచ్చు. దీని స్క్రీన్‌పై ‘జాలీ’ అని పిలువబడే ఒక డిజిటల్ క్యారెక్టర్ కనిపిస్తుంది, దీనిని వినియోగదారులు తమకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇది జపాన్‌కు చెందిన ప్రసిద్ధ వర్చువల్ పెట్ టాయ్ ‘తమాగోచి’ ని పోలి ఉంటుంది. అయితే మ్యూజ్ చార్మ్ కేవలం వినియోగదారులకు వినోదాన్ని అందించడం కోసం కాకుండా, ఆచరణాత్మక పనులను నిర్వహించడానికి రూపొందించారు. ఆన్లైన్ షాపింగ్, ఫ్లైట్ బుకింగ్‌లు , ఫారమ్‌లను పూరించడం వంటి కార్యకలాపాలలో ఈ అసిస్టెంట్ సహాయ పడుతుందని భావిస్తున్నారు.


















