Ambani : భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా విస్తృత రిటైల్ ప్రాబల్యాన్ని కలిగిన రిలయన్స్ రిటైల్, ప్రఖ్యాత గృహోపకరణాల బ్రాండ్ కెల్వినేటర్‌ను అధికారికంగా కొనుగోలు చేసింది. ఈ పరిణామం ద్వారా సంస్థ భారతీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తోంది.
Ambani New Innovation
శతాబ్దకాలపు వారసత్వాన్ని కలిగిన కెల్వినేటర్ బ్రాండ్, గృహ వినియోగానికి ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రముఖ సంస్థగా పేరొందింది. 1970–80లలో “ది కూలెస్ట్ వన్” అనే ట్యాగ్‌లైన్‌తో భారతీయుల మదిలో గుర్తింపు సంపాదించింది. అత్యుత్తమ నాణ్యత, ఆధునిక సాంకేతికత, విశ్వసనీయత వంటి అంశాల వల్ల ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ మార్కెట్లో ఆదరణ కొనసాగుతోంది.
రిలయన్స్ రిటైల్ ఈ కొనుగోలుతో తన విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా కెల్వినేటర్ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇది భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ప్రీమియం గృహోపకరణాల మార్కెట్‌లో సంస్థకు మరింత స్థానం కల్పించనుంది.
ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ (Isha Ambani) మాట్లాడుతూ:
“సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, వినియోగదారుల భవిష్యత్ అవసరాలకు తగ్గ సేవలు అందించడమే మా లక్ష్యం. కెల్వినేటర్‌ను మా రిటైల్ శక్తితో కలపడం, ప్రపంచస్థాయి ఉత్పత్తులను భారతీయ కుటుంబాలకు అందించడంలో మాకు మరింత ఊతమిస్తుంది.” అని తెలిపారు.
ఈ ఒప్పందంతో భారతదేశంలో గృహోపకరణాల రంగం కొత్త దిశగా దూసుకెళ్లనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వినియోగదారులకు అధిక నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఉత్పత్తులు మరింత చేరువయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : ESIC Scheme Interesting : దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
