తిరుపతి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది . ఈ ఉత్సవాలకు నవంబరు 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు మత్స్యగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్వరణం నిర్వహిస్తారు. మొదటి రోజైన నవంబరు 5న ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రెండో రోజైన 6న మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. చివరి రోజైన 7న రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాల్లో భాగంగా నవంబరు 5, 7 తేదీల్లో ఉదయం 11 గంటలకు, నవంబరు 6న ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. 6న సాయంత్రం 5 గంటలకు స్వామి వారు, అమ్మవార్ల వీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలో తెలియక జరిగే దోషాల నివారణకు, ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. భక్తులు, సిబ్బంది తెలియక చేసే పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా వేదపఠనం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు.



















