ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. దీంతో ఇంద్రకీలాద్రిపై సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. విజయదశమి అనంతరం గత రెండు రోజులుగా పోటెత్తిన భవానీ దీక్షాధారుల రద్దీ ఈరోజు ఉదయం వరకు కొనసాగింది. వేలాదిగా విచ్చేసిన భవానీలు ఇరుముడులు సమర్పించి, అమ్మవారిని దర్శించుకుని తమ దీక్షలను శాస్త్రోక్తంగా విరమించారు. మధ్యాహ్న సమయానికి భవానీల రద్దీ క్రమంగా తగ్గడంతో ఆలయ ప్రాంగణమంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. రద్దీ సాధారణ స్థితికి చేరుకోవడంతో, దసరా ఉత్సవాల నిమిత్తం ఘాట్ రోడ్డు, క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాలు, ప్రసాద వితరణ తదితర ప్రాంతాలలో ప్రత్యేక విధుల్లో నియమితులైన దేవస్థాన అధికారులు, ఉద్యోగులు ఆ బాధ్యతలను ముగించుకుని తమ తమ సాధారణ విభాగాల విధులకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రానికి విచ్చేసే సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదం, పూజా టికెట్లు, విరాళాల కౌంటర్లు తదితర అన్ని సేవా కౌంటర్లను మధ్యాహ్నం నుండే పూర్తిస్థాయిలో తెరిచి భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిత్య అన్నప్రసాద వితరణ, ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనాలు నిబంధనల ప్రకారం సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మ వారి ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. మరో వైపు శ్రీ కనకదుర్గమ్మను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు.


















