న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవ చనం, మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు సుమంత్ రెడ్డి, ఏఈవో బాలరాజు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రంగనాయక్, ఉదయ్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.మే 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు రాత్రి పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు.
2వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 3వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 4న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 5న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం, 6న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 7న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 8న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 9న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం జరగనుంది.


















