చిత్తూరు జిల్లా : ఈ దేశంలో తొలిసారిగా మహిళల కోసం స్వయం సహాయక సంఘాలను ప్రవేశ పెట్టిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడిదని పేర్కొన్నారు బాబు సతీమణి, హెరిటేజ్ చైర్మన్ , ఎండీ నారా భువనేశ్వరి. ఆమె కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కుప్పం మండలం వసనాడులో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారని, ప్రజలే కుటుంబంగా భావిస్తారని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్ నిర్మాణం మనం చూశాం అన్నారు. 2019-2024 మధ్య రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదని దీనికి కారకుడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారన్నారు.
అపారమైన అనుభవం కలిగిన చంద్రబాబు వల్లే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు నమ్మారన్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. పిల్లల చదువు భారం కాకూడదని తల్లికి వందనం కింద ఆర్ధిక సాయం అందిస్తున్నారని, దీని వల్ల విద్య కోసం ఎదురయ్యే ఇబ్బందులు తొలగి పోతాయన్నారు. చదువు ఒక్కటే మనకు సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలన సామర్థ్యంపై నమ్మకంతో ఏపీకి భారీ పరిశ్రమలు తరలి వస్తున్నాయని అన్నారు.
















