అమరావతి : మొదటి దశలో జూలై 31 నాటికి ప్రధానంగా అనంతపురం, కర్నూలు, మార్కాపురం ప్రాంతాల్లోని 1.78 లక్షల హెక్టార్లకు 26,950 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రెండో దశలో ఆగస్టు 15 నాటికి 21 జిల్లాల్లోని 429 మండలాల్లో 4.78 లక్షల హెక్టార్లకు అదనంగా 95,838 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని చెప్పారు. అవసరమైన విత్తనాలను సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ఆయకట్టు ప్రాంతాల్లో కూడా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, కాలువల ద్వారా నీటి విడుదలలు తక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని, నీటిపారుదల, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కాలువ చివరి ప్రాంతాలు, తేమ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
దీర్ఘకాలిక వరి రకాల నుంచి ఇతర ప్రత్యామ్నాయ పంటలకు మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరిపాలన, వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు , ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రత్యేక జిల్లా సమీక్ష, సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయి అధికారులు అవసరమైన పంట రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఇంకా అమలు చేయని ప్రాంతాలతోపాటు ప్రధాన పంట సాగు ప్రాంతాల్లో కూడా పీఎండీఎస్ విత్తన పెల్లెటైజేషన్ కార్యక్రమాలను మిషన్ విధానంలో చేపట్టాలని సూచించారు.
రైతుల వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రాంతాలవారీ ప్రత్యేక సూచనలను క్రమం తప్పకుండా రైతులకు పంపించాలని మంత్రి తెలిపారు. జిల్లా వ్యవసాయ అత్యవసర ప్రణాళికలకు అనుగుణంగా డీఏఏటీటీసీలు, కేవీకేలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సంప్రదించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల్లో అత్యధిక సంఖ్యలో రైతులు నమోదు అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావ నివారణ చర్యలను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని అంశాల ప్రస్తుత పరిస్థితిని జిల్లా వనరుల కేంద్రాలు సమీక్షించాలని తెలిపారు. జిల్లా ప్రత్యేక రైతు సూచనలను విస్తృతంగా తెలియ జేయడానికి ఐసీసీ హెల్ప్‌లైన్ 155251, టెలివిజన్, రేడియో, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఐవీఆర్‌ఎస్/ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత రైతు సమాచార ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
