పెనుకొండ/శ్రీసత్యసాయి : పార్లమెంట్ లో అమరావతి బిల్లు పాస్ కావడంతో, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చుకోదగిన రాజధాని నిర్మాణం కాబోతోందని, స్వర్ణాంధ్రప్రదేశ్ కు బలమైన పునాదులు పడుతున్నాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వెలిబుచ్చారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడికి, కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామన్ కు, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, జగన్ మైండ్ పని చేయడం లేదన్నారు. నిన్నటి వరకూ మూడు ముక్కలాట ఆడిన జగన్ … నేడు మావిగన్ అంటూ పిచ్చి ప్రేలాపన చేస్తున్నాడని మండిపడ్డారు.
పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చి ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారని, భవిష్యత్తులో జగన్ కు ప్రజలు అధికారం ఇవ్వడం కల్లని అని అన్నారు. రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో, మంత్రి సవిత నేతృత్వంలో గురువారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పట్టణ ప్రజలను, కూటమి నాయకులను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. నేడు నవ్యాంధ్రప్రదేశ్ కు శుభ దినమన్నారు. బుధవారం లోక్ సభలో, నేడు రాజ్యసభలో అమరావతికి బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీల ఎంపీలూ ఆమోదం తెలపడం ఆనందకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చదగిన రాజధానిగా అమరావతి ఆవిర్భవించనుందన్నారు. ఇప్పటికే సైబారాబాద్ ను నిర్మించి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత సీఎం దేనన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కూర్చోడానికి సీటు కూడా లేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, సీమాంధ్రుల కలలు నెరవేర్చడానికి సీఎం అమరావతి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి సవిత గుర్తు చేశారు.
















