చెరువుల‌న్నీ సుంద‌రంగా మారాలి : ఏవీ రంగ‌నాథ్

క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించిన క‌మిష‌న‌ర్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : నగరంలో చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. అలాగే వాట‌ర్ లాగింగ్ పాయింట్ల వ‌ద్ద వ‌రద నీరు సాఫీగా సాగేలా తీసుకున్న చర్యలను త‌నిఖీ చేశారు. నెక్నాంపూర్లోని ఇబ్రహీంబాగ్ చెరువుతో పాటు నానక్ రాంగూడ లోని భగీరథమ్మ చెరువు, తౌతానికుంట, చందాన‌గ‌ర్‌లోని గంగారం చెరువు, మ‌దీనాగూడ‌లోని ఈర్ల చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఆరా తీశారు. చెరువుల అభివృద్ధితో పాటే వరద కట్టడికి ఇన్లెట్లు, ఔట్లెట్లు నిర్మాణం శాస్త్రీయంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఎస్‌టీపీల నిర్మాణాన్ని కూడా త్వ‌రగా పూర్తి చేసి అభివృద్ధి చేసిన చెరువుల్లోకి శుద్ధ జ‌లాలు వ‌చ్చేలా చూడాల‌ని అన్నారు.

హైడ్రా రెండోద‌శ అభివృద్ధి చెరువుల చెంత ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు. విశాల‌మైన బండ్‌లు ఏర్పాటు చేసి వాక్‌వేలు, ఓపెన్ జిమ్‌లు, ప‌చ్చిక బైళ్లు, పార్కులు, చిల్డ్ర‌న్ ప్లే ఏరియాలు, అన్ని వ‌య‌సుల వారు సేద‌దీరేలా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ఇబ్ర‌హీంబాగ్ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే అధిక మొత్తంలో మురుగు నీటిని శుద్ధి చేసే ఎస్‌టీపీల‌ను సిద్ధం చేయాల‌ని అన్నారు. భ‌గీర‌థ‌మ్మ చెరువుకు ఇన్‌లెట్ల‌తో పాటు.. ఔట్‌లెట్లు అభివృద్ధి చేసి చెరువులోకి నీరు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. చెరువు చెంత ఉన్న ఎస్‌టీపీ నీరు చెరువుకు చేరేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. నాన‌క్‌రామ్‌గూడ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఇరువైపులా ఉన్న తౌతానికుంట – భ‌గీర‌థ‌మ్మ చెరువుల మ‌ధ్య అనుసంధానంగా ఉన్న వ‌ర‌ద కాలువ‌ను పున‌రుద్ధ‌రించాల‌న్నారు. ఉర్దూ విశ్వ విద్యాల‌యం నుంచి పెద్ద మొత్తంలో వ‌చ్చే వ‌ర‌ద నీరు తౌతానికుంట‌కు చేరేలా చూడాల‌న్నారు. చెరువు మ‌ధ్య‌లో ఉన్న ర‌హ‌దారికి ప‌రిస‌ర కాల‌నీల నుంచి రాక‌పోక‌లు సాగేలా చూడాల‌ని సూచించారు.

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి పెద్ద‌మొత్తంలో వ‌చ్చే వ‌ర‌ద అక్క‌డి ర‌హ‌దారిని ముంచెత్తే ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు అక్క‌డ కొత్త‌గా నిర్మించిన పైపులైన్ల ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. గ‌తంలో ఇక్క‌డ వ‌ర‌ద పెద్ద‌మొత్తంలో రోడ్డుపై నిలిచేద‌ని అన్నారు. ఈ వ‌ర‌ద‌ను రోడ్డు దాటేలా ఏర్పాటు చేసిన పైపుల్లోంచి పోచ‌మ్మ‌కుంట‌కు వెళ్లేలా చేసిన ఏర్పాట్ల‌తో వ‌ర‌ద ముప్పు త‌ప్పింద‌ని హైడ్రా డీఎఫ్‌వో గౌత‌మ్ , ఎస్ ఎఫ్‌వో ద‌త్తు క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. బయోడైవర్సిటీ, మల్కం చెరువు పరిసరాల్లో గతంలో వరద ముంచెత్తే ప్రాంతాలను పరిశీలించారు.

Exit mobile version