ముంబై : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా దిగ్గజ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచే ముంబై బౌలర్లను బాదడం మొదలు పెట్టింది. ఓ వైపు వికెట్లు పడి పోతున్నా ఎక్కడా ఆగకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
మరో వైపు సీఎస్కే యాజమాన్యం ఏరికోరి తెచ్చుకున్న కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ మరోసారి రెచ్చి పోయాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో తను రెండో సెంచరీ చేశాడు. 54 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 6 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 101 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు సీఎస్కే బౌలర్లు అకీల్ హుసేన్ , నూర్ అహ్మద్ లు మిస్సైల్ లాంటి బంతులు వేసి పెవిలియన్ బాట పట్టించారు. బౌలింగ్ విషయానికి వస్తే అకీల్ హుసేన్ 4 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తిలక్ వర్మ 37 రన్స్ చేయగా సూర్య 36 పరుగులు చేసి ముంబై పరువు పోకుండా కాపాడారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముంబైపై 103 పరుగుల భారీ తేడాతో విక్టరీ నమోదు చేసింది.

















