ముంబై : ఇటీవలే క్రికెట్ నుంచి నిష్క్రమించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానేకు అరుదైన ఛాన్స్ లభించింది . యూరోపియన్ టి20 ప్రీమియర్ లీగ్‌లో తను ఆడేందుకు ఛాన్స్ దొరికింది. ఈ విషయాన్ని ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టు ప్రకటించింది. తమ టీమ్ లో చేరాలని రహానేను కోరింది. దీనికి తను ఓకే చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ టోర్నమెంట్ ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు ఐర్లాండ్‌లోని డబ్లిన్ , నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరాల్లో జరగనుంది. ఈ అవకాశంతో ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నాడు. ఇది నాకు లభించిన గొప్ప అవకాశం అన్నాడు . శుక్రవారం రహానే మీడియాతో మాట్లాడాడు. నేను రిటైర్మెంట్ ప్రకటించిన రోజే ఈ అవకాశం వచ్చింది. దీని గురించి ఆలోచించడానికి నేను ఒక రోజు సమయం తీసుకున్నాను. ఫ్లేమ్స్ సహ-యజమాని స్టీవ్ వా స్వయంగా నాకు ఫోన్ చేసి, తన జట్టు తరపున ఆడటానికి ఆసక్తి ఉందా అని అడిగారు అని చెప్పాడు.
నాకున్న అనుభవం, ఇన్నాళ్లుగా ఒక నిర్దిష్ట దృక్పథం , మానసిక స్థితితో ఆడిన క్రికెట్ వీటన్నింటితో అక్కడకు వెళ్లి ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపడానికి ఇది గొప్ప అవకాశమని భావించాను. ఇతర ఆటగాళ్లతో నా అనుభవాన్ని పంచుకునేందుకు వీలు కలుగుతుందన్నాడు. అందుకే యూరోపియన్ టి20 లీగ్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు అజింక్య రహానే. ఈ లీగ్ వృద్ధి అవకాశాల పట్ల ఉత్సాహం వ్యక్తం చేశారు. ఇది ఆ ఖండంలో క్రికెట్ అభివృద్ధికి దోహదప డుతుందని ఆయన నమ్మారు. యూరోపియన్ జట్లను గమనిస్తే… ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటివి కనిపిస్తాయి. ఐర్లాండ్ ఇటీవల భారత్‌పై సిరీస్ గెలిచింది. నెదర్లాండ్స్ కూడా అప్పుడప్పుడు చాలా బాగా రాణిస్తోందని చెప్పాడు. నేను వారితో చాలా మ్యాచ్‌లు ఆడాను, ముఖ్యంగా ప్రపంచ కప్ మ్యాచ్‌లు. క్రికెట్ పట్ల వారికి ఉన్న అభిరుచి, నేర్చుకోవాలనే తపన, ఒక జట్టుగా మెరుగవ్వాలనే వారి ఆకాంక్ష అద్భుతం అని పేర్కొన్నాడు రహానే.
