అంతర్జాతీయ క్రికెట్ నుంచి అజింక్య రహానే నిష్క్ర‌మ‌ణ‌

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మిస్ట‌ర్ కూల్ ముంబై క్రికెట‌ర్

hellotelugu-ajinkyarahane

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , కామెంటేట‌ర్ అజింక్యా ర‌హానే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం ఆయ‌న క్రికెట్ అభిమానుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాను అంత‌ర్జాతీయ క్రికెట్ రంగం నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 2013లో మొదలైన తన కెరీర్‌లో రహానే భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడారు. గాయాల సమస్యలతో సతమతమైన భారత జట్టును 2021లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన టెస్ట్ సిరీస్ విజయానికి నడిపించిన ఘ‌న‌త అజింక్యా ర‌హానేదే. ఇక ముందుకు సాగడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. త‌న వ‌య‌సు ఇప్పుడు 38 ఏళ్లు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత ఆయన భారత జట్టులో ఆడలేదు, కానీ ఈ ఏడాది ఐపీఎల్ (IPL) సమయం వరకు కూడా జట్టులోకి తిరిగి రావాలనే తన కలను వదులు కోలేదు.

ప్రతిదానికీ ఒక ఆరంభం, ఒక ముగింపు ఉండటం జీవిత వాస్తవం. ఆ సమయం వచ్చినప్పుడు, దానిని గౌరవించి ముందుకు సాగాలి. నా బ్యాటింగ్‌లో నేను ఎప్పుడూ ‘టైమింగ్’ పైనే ఆధారపడే వాడిన‌ని పేర్కొన్నాడు ర‌హానే త‌న ఇన్ స్టా స్టోరీలో. అంతర్జాతీయ క్రికెట్ , అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని నాకు అనిపిస్తోందన్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన రహానే టెస్టుల్లో 38.46 సగటుతో 5,077 పరుగులు చేశాడు . ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు చేశారు. అలాగే 90 వన్డేల్లో 35.26 సగటుతో 2,962 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు సాధించాడు. 20 టీ20 మ్యాచ్‌లలో రహానే 375 పరుగులు చేశారు.

రహానే కెరీర్‌లో అత్యంత కీలక ఘట్టం 2021లో చోటుచేసుకుంది. అప్పుడు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టు బాధ్యతలు చేపట్టిన రహానే, కీలక ఆటగాళ్లు లేని భారత జట్టుతో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే 2-1 తేడాతో ఓడించి, అందరి అంచనాలను తలకిందులు చేశాడు. చిన్న వయసులో డొంబివ్‌లి నుండి కేవలం ప్రాక్టీస్ కోసం ప్రయాణిస్తూ మొదలు పెట్టిన నా ప్రయాణంలో ఈ క్రీడ కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. ప్రతి రోజూ, ప్రతి ఇన్నింగ్స్, బ్యాటింగ్ చేసే ప్రతి అవకాశంలోనూ భారత జట్టు తరఫున ఆడాలన్నదే నా ఏకైక కలగా ఉండేది అని తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్‌లలో కామెంటేటర్‌గా వ్యవహరించిన రహానే ఇకపై కూడా ఈ క్రీడతో అనుబంధాన్ని కొనసాగిస్తానని చెప్పాడు.

Exit mobile version