ముంబై : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు సుభాష్ ఘాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన తాల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వసూళ్లలో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ ఎప్పటికీ తాల్ మూవీ అరుదైన చిత్రంగా గుర్తు పెట్టుకునేలా చేశాడు దర్శకుడు. ఇదిలా ఉండగా తాజాగా సుభాష్ ఘాయ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను తాల్ మూవీ తీసే సమయంలో తొలుత ఐశ్వర్య రాయ్ ని నటిగా అనుకోలేదని అన్నాడు. మొదట తిరస్కరించానని, కానీ తమిళంలో వచ్చిన ఇరువర్ మూవీ చూశాక తాను మనసు మార్చుకున్నట్లు తెలిపాడు. తన పట్ల తనకున్న అభిప్రాయాలను పూర్తిగా మార్చి వేసిందన్నాడు. 1999లో వచ్చిన తన సంగీత ప్రధాన చిత్రం ‘తాళ్’ కోసం ఐశ్వర్య రాయ్‌ను మొదట ఎంపిక చేయకూడదని అనుకున్నట్లు పేర్కొన్నాడు. తన సినిమాలో ఉన్న క్లిష్టమైన పాత్రకు కాకుండా కేవలం గ్లామర్ , మోడలింగ్ రంగానికి మాత్రమే సరిపోతుందని భావించినట్లు చెప్పాడు ఘాయ్.
ఇదిలా ఉండగా సినిమాలోని సవాలుతో కూడిన నృత్య సన్నివేశాలను చేయగల నటి కోసం వెతుకుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఐశ్వర్య పేరును సూచించారని ఘాయ్ గుర్తు చేసుకున్నారు. మాధురీ దీక్షిత్ కాకుండా ఆ పాత్రను ఎవరు చేయగలరని ఘాయ్ అడిగినప్పుడు ఖాన్ ఐశ్వర్యను ప్రతిపాదించారని వెల్లడించారు. అయితే మొదట్లో ఆమెపై నమ్మకం కలగలేదని ఘాయ్ చెప్పారు. 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఐశ్వర్య, అప్పటికే తన అందం , మోడలింగ్ కెరీర్‌తో మంచి గుర్తింపు పొందారు. తన సినిమాకు ఆమె సరైన ఎంపిక అని వెంటనే అనుకోలేదు. కానీ మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య నటిగా పరిచయమైన ‘ఇరువర్’ సినిమా చూశాక ఆయన అభిప్రాయం మారింది. ఆ తమిళ సినిమాను చూడమని ఎవరో తనకు సూచించారని, అందులో ఆమె నటన చూశాక ‘తాళ్’ చిత్రానికి అవసరమైన నటన ఆమెకు ఉందని తనకు అర్థమైందని ఘాయ్ చెప్పారు.
