తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సేవాకాలం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారిని, సేనాధిపతి వారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, అర్చకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 25 వ తేదీన తిరుమలలో రథ సప్తమి నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆరోజు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, దీంతో ఆరోజు పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈవో.
