తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవెలపర్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక నుంచి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. సోషల్ మీడియాలో “SCP Developers” పేరుతో కొంతమంది వ్యక్తులు తిరుపతి హైవే లో ప్లాట్లు కొనుగోలు చేస్తే “జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం” అంటూ ప్రచారం చేస్తున్న రీల్స్‌ను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపింది.
ఈ ప్రచారానికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకు, వ్యక్తికి లేదని టీటీడీ పేర్కొంది . శ్రీవారి దర్శనానికి సంబంధించిన అన్ని విధానాలు, సేవలు, టికెట్లు పూర్తిగా టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే అమలులో ఉంటాయని నొక్కి చెప్పింది. ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు భక్తులను ఆకర్షించేందుకు టీటీడీ పేరు, శ్రీవారి పేరు, దర్శనాల పేరును ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతా రాహిత్యమైన చర్యగా పరిగణిస్తామని వెల్లడించింది.
భక్తులు ఇటువంటి తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియా రీల్స్, వాణిజ్య ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం టీటీడీ అధికారిక ప్రకటనలు, వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా వేదికలను మాత్రమే విశ్వసించాలని భక్తులను కోరింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు ప్రకటన కొరకు పరి శోధించే క్రమంలో
ఆ సంస్థ తమ వ్యాపార ప్రకటన సోషల్ మీడియా నుండి తీసివేసినట్లు గుర్తించడం జరిగిందని, అయినప్పటికీ వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపింది టీటీడీ.
