తిరుమల : టీటీడీలో వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తూ, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమలలోని గోకులం అతిథి గృహంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. టీటీడీ సిబ్బంది, తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసు విభాగం, శ్రీవారి సేవకులు, భక్తులు, మీడియా ప్రతినిధులకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన టీటీడీ సిబ్బంది, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజ్యాంగ స్ఫూర్తే వ్యవస్థల నిర్మాణానికి పునాది అన్నారు వెంకయ్య చౌదరి. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి, స్వయం పాలన సాధించిన రోజు అని అన్నారు. ఏ దేశమైనా, ఏ సంస్థైనా దీర్ఘకాలికంగా నిలవాలంటే బలమైన వ్యవస్థ, స్పష్టమైన నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. భారత రాజ్యాంగం కాలానుగుణంగా సవరణలు చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగడం వల్లే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని తెలిపారు.
