కేరళ : సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన జైలర్ -2లో తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది నటి అన్నా రాజన్. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న మార్ఫ్ చేసిన, అభ్యంతరకరమైన చిత్రంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నటి అన్నా రాజన్ ప్రకటించారు. ‘జైలర్ 2’ చిత్రంలో తన నటనతో గుర్తింపు పొందిన అన్నా రాజన్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఒక మార్ఫ్ చేసిన (మార్పులు చేసిన) చిత్రం కారణంగా ఎదురైన ఆన్‌లైన్ వేధింపులపై స్పందించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు విశ్రమించనని స్పష్టం చేశారు అన్నా రాజన్.
ఆ చిత్రాన్ని షేర్ చేసినా లేదా మార్ఫ్ చేసినా వారిపై ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే దురుద్దేశపూర్వక ప్రయత్నంగా పేర్కొంటూ, ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె పంచుకున్నారు. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ చిత్రాన్ని దురుద్దేశ పూర్వకంగా ఎడిట్ చేసి, అసభ్యకరమైన , పరువు నష్టం కలిగించే రీతిలో పోస్ట్ చేశారని వాపోయారు. ఇది సిగ్గుచేటు, ఆమోద యోగ్యం కాని విషయం అని పేర్కొన్నారు. నా గోప్యత, గౌరవాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని ఆమె రాశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అన్నా ఇలా పేర్కొన్నారు: ఈ ఖాతా నా గురించి దురుద్దేశ పూర్వకంగా ఎడిట్ చేసిన, పరువు నష్టం కలిగించే చిత్రాన్ని పోస్ట్ చేసింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేరళ పోలీసులను కోరుతున్నాను. నేను సాక్ష్యాలను భద్రపరిచాను , అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నానని ప్రకటించారు.
