సినిమా షూటింగ్ లో న‌టుడు విశాల్ కు గాయం ..?

యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సంఘ‌ట‌న

hellotellugu-ActorVishal

గోవా : ప‌లువురు న‌టులు ఈ మ‌ధ్య‌న గాయాల బారిన ప‌డుతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత, ఇప్పుడు తమిళ స్టార్ విశాల్ కూడా గాయపడ్డారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పురుషన్’ (తెలుగులో ‘మొగుడు’) చిత్రంలోని యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గోవాలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ సమయంలో ఈ ఘటన జరిగిందని, దీనివల్ల షూటింగ్ తాత్కాలికంగా నిలిపి వేయబడిందని సమాచారం. తిరిగి సెట్స్‌కు వచ్చే ముందు విశాల్‌కు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. విశాల్ రెడ్డితో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ పై అంచ‌నాలు పెంచేలా చేశాయి. ఈ త‌రుణంలో పురుషన్ ఒక యాక్షన్ కామెడీ చిత్రంగా తీర్చిద‌ద్ద బోతున్నారు ద‌ర్శ‌కుడు. ‘ఆంబళ’, ‘యాక్షన్’, ‘మధ గజ రాజా’ చిత్రాల తర్వాత విశాల్ , ద‌ర్శ‌కుడు సుందర్ సి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం ఇది.

మ‌రో వైపు ఈ వినోదాత్మ‌క చిత్రంలో కామెడీ కింగ్ యోగి బాబు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర కథాంశం ప్రత్యేకతను తెలిపేలా ఒక సుదీర్ఘమైన టైటిల్ ప్రోమోను ఇటీవ‌ల‌ చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విశాల్ పైకి లొంగి ఉండే భర్తలా కనిపిస్తూనే, రహస్యంగా హింసాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. తమన్నా ఆధిపత్యం చెలాయించే భార్య పాత్రలో కనిపిస్తున్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే హాస్యం , యాక్షన్ కలయికతో రూపొందిన ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి. విశాల్‌కు గాయం కారణంగా గోవా యాక్షన్ షెడ్యూల్ తాత్కాలికంగా ఆగి పోవడంతో, ఆయన కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ‘పందెం’, ‘పొగరు’ వంటి చిత్రాలతో విశాల్ తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందారు.

Exit mobile version