అమరావతి : బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చాలా సేపు చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు తయారు చేశామని ఈ సందర్బంగా సంజయ్ దత్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
తద్వారా సినిమా, వినోద రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్‌ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు బాలీవుడ్ నటుడు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ రావడంతో సానుకూల పరిణామాలు ఏర్పడ్డాయని తెలిపారు. అంతే కాకుండా సినిమా రంగానికి ఏపీని హబ్ గా తయారు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులతో వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇచ్చేలా పారిశ్రామిక పాలసీని తయారు చేసినట్లు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.



















