అనంతపురం జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఆదివారం జిల్లా టీడీపీ అధ్యక్షులు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరితో కలిసి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్కి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గత 40 ఏళ్లుగా రాజకీయంగా ప్రజల సేవ చేస్తూ, ప్రజా జీవితం గడుపుతున్న సీఎం చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పట్ల టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేగాక వైసీపీ నేతలు అనునిత్యం రాష్ట్రంలో శాంతి భద్రతల కు విఘాతం కల్గించే విధంగా అశ్లీల, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, అల్లర్లు, గొడవలకు మూల కారణం అవుతున్నారని ఆరోపించారు బండారు శ్రావణి శ్రీ. ఆదివారం ఎస్పీని కలిసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తక్షణమే అంబటి రాంబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని చెప్పారు. రాష్ట్రంలో అలజడులు రేపడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. గత జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిర్వీర్యం చేశారని ఆవేదన చెందారు బండారు శ్రావణి శ్రీ.

















