చెన్నై : రాష్ట్రవ్యాప్తంగా రైతుల ప్రయోజనాల కోసం, నీటి అవసరాలను తీర్చడానికి నదుల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వ్యవసాయానికి నీటి లభ్యతను బలోపేతం చేసేందుకు గోదావరి-కావేరి-గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఒక ముఖ్యమైన అంశం వైపు మళ్లించారు. తమిళనాడులో ఉపరితల నీటి వనరుల కొరత ఉండటం , రాష్ట్ర నీటి అవసరాలలో 30 శాతానికి పైగా పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి రావడం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోదీకి లేఖ రాశారు. అందులో కీలకమైన నీటి లభ్యత, సమస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర ఉపరితల నీటి వనరులను పెంచడానికి ఈ అనుసంధాన ప్రాజెక్టు అత్యంత కీలకమైన దీర్ఘకాలిక అవకాశమని, అలాగే పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడానికి ఇది అత్యంత ఆవశ్యకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం నియంత్రణ , సంరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరిందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పుదుక్కోట్టై, శివగంగై, రామనాథపురం ,విరుదునగర్ వంటి దక్షిణ జిల్లాల్లో తీవ్రమైన నీటి కొరత, కరువు పరిస్థితులు ఉన్నందున, పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడానికి ‘గోదావరి-కావేరి-వైగై-గుండార్ అనుసంధాన ప్రాజెక్టు’ అమలు అత్యంత స్థిరమైన మార్గమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న బేసిన్ల నుండి అదనపు వరద నీటిని నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సీఎం విజయ్. అలాగే, ఈ బృహత్తర ప్రాజెక్టులో మొదటి దశగా ‘గోదావరి-పెన్నార్-పాలార్-వెల్లార్ అనుసంధాన’ పథకానికి నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ను సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.
