నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి అవ‌స‌రం : వాసం శెట్టి

ఏపీ రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

hellotelugu-VsamShettySubhash

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని తయారు చేయడంలోఅధునాతన నిర్మాణ కార్యకలాపాలు, నిర్మాణ సాంకేతికతలపై జాతీయ వర్క్‌షాప్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, గృహ నిర్మాణ కార్యక్రమాల నేపథ్యంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం మరింత పెరిగిందన్నారు. గత ఐదేళ్ల పాలనలో పరిశ్రమలను ప్రోత్సహించకుండా మూసివేసే విధానాలు అమలయ్యాయని విమర్శించారు. సరైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లేక యువత, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డుకు వచ్చిన రూ.2574 కోట్ల సెస్ నిధుల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది నారా లోకేష్ దూరదృష్టికి నిదర్శనమన్నారు వాసం శెట్టి సుభాష్‌. కార్మికులు కేవలం హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలంటే నైపుణ్యాభివృద్ధి అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంపై కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు అమలు చేస్తోందన్నారు. NAC సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, భద్రతా ప్రమాణాలు, ప్రాక్టికల్ శిక్షణపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.

Exit mobile version