తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఈనెల 25న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఘనంగా జరిగిందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్బంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ విశేషాలను పంచుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షించారని చెప్పారు. అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం అయ్యామన్నారు. రథ సప్తమి రోజున గ్యాలరీల్లోని భక్తులందరికీ ఉదయం నుండి రాత్రి వరకు విరివిగా అన్న ప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేశామన్నారు సింఘాల్ . సొజ్జ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబార్ రైస్, టమోటా రైస్, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, కాఫీ, పాలు, మజ్జిగ, సుండలు, బిస్కెట్లను భక్తులకు పంపిణీ చేశామన్నారు.
9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీవారి సేవకుల సేవలు అందించారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలలో పాల్గొన్నారని తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్స్, బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్ చేశారన్నారు. ఇది గత ఏడాది కంటే 73 శాతం అధికం అన్నారు. పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భక్తులకు అవసరమై సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ భాషల్లో అందజేశామన్నారు ఈవో. భక్తులను తిరుమలకు చేరవేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ అద్భుతమైన సేవలు అందించినట్లు ప్రశంసించారు. శ్రీవారి వాహనసేవల ఎదుట భక్తులను ఆకట్టుకునేలా 1000 కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారన్నారు.
