విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ కళా, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ . శనివారం విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో కవులు, కళాకారులకు కొదవ లేదన్నారు. అద్భుత సంగీత ప్రపంచానికి నీరాజనం అందిద్దామని పిలుపునిచ్చారు. ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కూడా తెలియ చేశారని తెలిపారు కందుల దుర్గేష్.
రాష్ట్ర విభజన కారణంగా కోల్పోయిన అనేక శిక్షణా సంస్థలతో పాటు ఏపీకి సంగీత, నాటక, నృత్య శిక్షణ సంస్థ కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామన్నారు మంత్రి. నేటి తరానికి కళారూపాల ఆవశ్యకతను వివరించి వాటిపై అనురక్తి కలిగించే బాధ్యతను తీసుకుందామని కోరారు. కూటమి ప్రభుత్వం కళా, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. అంతే కాకుండా సినిమా రంగానికి, పర్యాటక రంగానికి ఏపీ రాష్ట్రాన్ని కేరాఫ్ గా మారుస్తామని ప్రకటించారు.
