ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు భారీ చిత్రం

విష్ణు పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్రాజెక్టు ప్ర‌క‌ట‌న

hellotelugu-PrabhuDeva

హైద‌రాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు హీరోగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకత్వంలో భారీ బహుభాషా చిత్రం తెరకెక్కనుంది. విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ పక్కా యాక్షన్ థ్రిల్లర్‌కు తాత్కాలికంగా ‘#VM24’ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకునే ఈ కాంబినేషన్ ప్రకటనతో ఇరు పరిశ్రమల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. సోషల్ మీడియా వేదికగా విష్ణుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ప్రభుదేవా ఈ విషయాన్ని పంచుకున్నాడు. నా హీరో, తమ్ముడు మంచు విష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేస్తూ ‘#VM24’ను ప్రకటిస్తున్నాం అని వెల్ల‌డించాడు.

ఎక్స్ లో త‌న ఖాతా ద్వారా ఈ విష‌యాన్ని తెలిపాడు ప్ర‌భుదేవా. ఈ ప్రాజెక్ట్‌తో విష్ణు నేరుగా కోలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నాడు. చెన్నైలోనే పుట్టి పెరిగిన విష్ణుకు తమిళ భాషపై మంచి పట్టు ఉండటంతో పాటు అక్కడి సంస్కృతితో ప్రత్యేక అనుబంధం ఉంది. ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’ వంటి విజయాలతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి అగ్ర తారలతో భారీ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ను తీశాడు. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. మరోవైపు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో దర్శకుడిగా మారి తమిళంలో ‘పోకిరి’, ‘రౌడీ రాథోడ్’, ‘వాంటెడ్’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన ప్రభుదేవా.. ఈ సినిమాతో మళ్లీ తెలుగు తెరపైకి దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నాడు. కథ, శీర్షిక, ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

Exit mobile version