రామంతాపూర్ లో ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు చేయాలి

డీజీపీ నీ కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

hellotelugu-MLADGP

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న జనాభా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు రామంతాపూర్‌లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని శాంతిభద్రతలు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 3 లక్షల మందికి పైగా జనాభా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థపై అదనపు భారం పడుతోందని ఎమ్మెల్యే వివరించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా రామంతాపూర్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, తగిన సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బందిని కేటాయించాలని కోరారు. అలాగే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌కు శాశ్వత భవనం ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న రామంతాపూర్ వార్డు కార్యాలయంలో తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రామంతాపూర్ పరిధిలోని ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ అవుతాయని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇదే సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధి నుంచి పోలీస్ స్టేషన్‌ను విభజించి ఉప్పల్ పరిధికి తీసుకు రావడంలో సహకరించినందుకు డీజీపీకి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఉప్పల్ నియోజకవర్గంలో జనాభా పెరుగుదల, కొత్త కాలనీల విస్తరణ, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రామంతాపూర్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు, అవసరమైన పోలీస్ సిబ్బంది కేటాయింపు అంశాలపై సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ సందర్భంగా డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు ల‌క్ష్మారెడ్డి. అవసరమైన చర్యలు తీసుకునే దిశగా సంబంధిత అధికారులతో చర్చిస్తామని తెలిపారు.

Exit mobile version