RBI : డిజిటల్ కాలంలో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (NBFCs), డిజిటల్ పేమెంట్ సేవలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవుతున్నాయి. ఇవి సులభతరం అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో సేవల లోపాలు, లావాదేవీలలో పొరపాట్లు, చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేకపోవడం గమనార్హం.
ఈ తరహా సమస్యలకు పరిష్కార మార్గంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా కంప్లయింట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) అనే ఆన్‌లైన్ ఫిర్యాదు వేదికను ప్రవేశపెట్టింది. ఈ వేదిక ద్వారా ఖాతాదారులు తమ సమస్యలను RBI దృష్టికి తీసుకెళ్లే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా సేవల లోపాలపై త్వరితగతిన స్పందనతోపాటు న్యాయసమ్మతమైన పరిష్కారాలను పొందడం సాధ్యమవుతోంది.
RBI – ఫిర్యాదు ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
- ముందుగా ఖాతాదారుడు సంబంధిత బ్యాంకు, NBFC లేదా పేమెంట్ చానల్‌కు ఫిర్యాదు చేయాలి.
- ఫిర్యాదుకు 30 రోజుల్లోగా స్పందన రాకపోతే లేదా వచ్చిన సమాధానం సంతృప్తికరం కాకపోతే, RBI CMS పోర్టల్ (cms.rbi.org.in) ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు.
- RBI సంబంధిత సంస్థకు ఫిర్యాదును పంపించి, నిర్ణీత సమయంలో స్పందించాలని ఆదేశిస్తుంది.
- అవసరమైతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారు.
- మధ్యవర్తిత్వం విఫలమైతే, అంబుడ్స్‌మన్ తుది నిర్ణయం తీసుకుంటారు.
ఫిర్యాదు చేయదగిన అంశాలు:
- బ్యాంకింగ్ సేవల లోపాలు
- డెబిట్/క్రెడిట్ లావాదేవీలలో పొరపాట్లు
- ATM, UPI లావాదేవీల విఫలం
- చెల్లింపుల ఆలస్యం లేదా తిరిగి రాకపోవడం
- అనధికారిక డెబిట్‌లు
- రుణ మంజూరు లేదా EMI సంబంధిత సమస్యలు
ఫిర్యాదులో చేర్చవలసిన సమాచారం:
- ఫిర్యాదుదారు పేరు, చిరునామా, మొబైల్ నంబర్
- సంబంధిత బ్యాంకు లేదా NBFC వివరాలు
- సమస్య వివరణ
- సంస్థతో జరిపిన మెయిల్/పత్రవ్యవహారాల నకళ్లు
- స్క్రీన్‌షాట్‌లు, ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్లు
- ఈ వివరాల ఆధారంగా పోర్టల్‌లో రెఫరెన్స్ నంబర్ జారీ చేయబడుతుంది. దీని ద్వారా ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేయవచ్చు.
తుది నిర్ణయం, అప్పీల్ ప్రక్రియ:
అంబుడ్స్‌మన్ తీర్పు ఫిర్యాదుదారుడికి అనుకూలంగా ఉంటే, సంబంధిత సంస్థ 30 రోజుల్లోగా అమలు చేయాల్సి ఉంటుంది. తీర్పు నచ్చకపోతే, రిజర్వ్ బ్యాంక్ అప్పీల్ అథారిటీకి నెల రోజులలోపు అప్పీల్ చేయవచ్చు. అక్కడి నిర్ణయం కూడా నచ్చకపోతే, కన్స్యూమర్ కోర్టు లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
సేవలు పూర్తిగా ఉచితం:
రిజర్వ్ బ్యాంక్ CMS పోర్టల్ సేవలు పూర్తిగా ఉచితం. ఖాతాదారులు బ్యాంకులకు, NBFC కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అయితే, సరైన ఆధారాలు, సాక్ష్యాలతో ఫిర్యాదు చేయడం అవసరం.
Also Read : Vande Bharat New Innovation : ‘వందే భారత్’ బయలుదేరే 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్


















