హైదరాబాద్ : కేంద్రం డీలిమిటేషన్ ప్రతిపాదనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్వాగతించారు. ఇది దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు లోక్‌సభ సీట్లు పెరుగుతాయని అంచనా వేశారు . ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ప్రశ్నించారు. డీలిమిటేషన్ సమయంలో పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు దామాషా ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్వాగతించారు. ఇది దక్షిణాది ప్రజల విజయమని ఆయన అభివర్ణించారు. ఆదివారం రామారావు మాట్లాడుతూ, లోక్‌సభలో ఈ ప్రాంతానికి ఉన్న 24 శాతం వాటాను నిలుపు కోవడానికి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిరంతరం పోరాడిందని అన్నారు. ఈ ప్రాతినిధ్యాన్ని కాపాడే డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.
గత నాలుగేళ్లుగా తమ పార్టీ ఇదే వైఖరిని కొనసాగించిందని చెప్పారు కేటీఆర్. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రమాదం ఉన్నందున పార్లమెంటులో గతంలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిందని అన్నారు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకూడదని ఆయన జోడించారు. ప్రాతినిధ్య సవరణకు జనాభా పెరుగుదలను ఏకైక ప్రాతిపదికగా చేసుకోని మొట్టమొదటి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇదేనని కేంద్రం తాజా ప్రతిపాదనను రామారావు అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రచారం, దక్షిణ రాష్ట్రాల ఐక్య ఉద్యమం ఫలితాలనిచ్చాయని, ఈ పరిణామం కేవలం పార్టీకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ విజయమని అన్నారు.
ప్రతిపాదిత ఏర్పాటు ప్రకారం, తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 180కి, లోక్‌సభ ప్రాతినిధ్యం 26కి పెరగవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెరుగుదల వల్ల ఎన్నికైన ప్రతినిధులు ప్రజలకు మరింత చేరువవుతారు. అదనపు లోక్‌సభ సీట్లు పార్లమెంటులో రాష్ట్రం తన సమస్యలను మరింత ప్రభావవంతంగా వినిపించడానికి సహాయ పడతాయి అని ఆయన అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఇందులో అన్ని రాజకీయ పార్టీలు పాలు పంచుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఏ రాష్ట్రానికీ నష్టం జరగకూడదని ఆయన అన్నారు.

















