హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకమైన మలుపుగా నవంబర్ 29, 2009. ఇవాల్టితో 17 సంవత్సరాలు . ఆనాడు కేసీఆర్ గనుక ఈ దీక్షా దివస్ చేపట్టక పోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం రాక పోయి ఉండేది. ఈ కార్యక్రమం గురించి గుర్తు చేసుకున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఈ దీక్షే రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని వారు పేర్కొన్నారు. ‘దీక్షా దివస్’ సందర్భంగా కేటీ రామారావు మాట్లాడుతూ.. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించాలనే కేసీఆర్ సంకల్పం జాతీయ రాజకీయాల గతిని మార్చివేసిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు అంగీకరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం లేదా కేసీఆర్ మరణం అనే నిశ్చయంతో ఆయన ఈ దీక్షను చేపట్టారని, తద్వారా 3.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని ఆయన అన్నారు.
నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ఉండేది కాదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 ఉండేది కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటనను రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అనేది కే చంద్రశేఖర్ రావు దృఢ సంకల్పం , అమరవీరుల త్యాగాల ఫలితమని హరీశ్ రావు అన్నారు. ఈ నిరాహార దీక్ష చరిత్ర గతిని మార్చి, తరతరాల ఆకాంక్షలను సాకారం చేసిందని ఆయన పేర్కొన్నారు . ప్రజలను ఏకం చేసేందుకు కేసీఆర్ తన పదవులను వదులుకున్నారు, రాష్ట్ర సాధన డిమాండ్‌పై కేంద్రం స్పందించేలా చేసేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు అని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేతను తెలంగాణ పోరాటానికి, అస్తిత్వానికి నిలువుటద్దంగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం ఇప్పటికీ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

















