హైదరాబాద్ : మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’పై ప్రశంసలు కురిపించారు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. దుల్కర్ సల్మాన్ , సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం ఇవాళ (నవంబర్ 20) థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకు పోతున్న ఈ చిత్రం మొదటి రోజే బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను తిరగరాసే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అద్భుతమైన అవుట్‌పుట్‌ను అందించిన చిత్ర బృందాన్ని ప్రశంసించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్.ఎస్. రాజమౌళి తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. కలలు కనడం ఒక వరం. వాటిని నిజం చేసుకోవడానికి పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండింటిని తెరపై ఆవిష్కరించిన దర్శకుడికి, తమ నటనతో ఆకట్టుకున్న నటీ నటులకు ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు .
ఇక జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆకాశంలో ఒక తార చిత్రంలో నాకు అత్యంత సన్నిహితులు చాలామంది పని చేశారు, అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకం. స్వప్న ఎప్పుడూ కొత్త , విభిన్నమైన కథలకు మద్దతు ఇస్తుంటారు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం ఒక అలవాటుగా మారింది. అరవింద్ అల్లు మంచి సినిమాలపై మీకు ఉన్న నమ్మకం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. అంతకంటే తెరపై సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు తారక్.


















