హైదరాబాద్ : మీరు ఇంటి నుంచి ఎలాగైతే పని చేయగలరో అలాగే ఇప్పుడు తమ్మిడికుంట చెరువు నుంచి కూడా పని చేసుకోవచ్చని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సరస్సు అభివృద్ధి నగరవాసులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు సరస్సు వద్దకు వచ్చి పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం మధ్య పని చేయవచ్చని ఆయన అన్నారు. మీరు ఇంట్లో ఏసీ లేకుండా ఉండలేకపోతే.. సరస్సు వద్ద చల్లని వాతావరణం మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచుతుందని చెప్పారు. హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట సరస్సును ప్రారంభించి ప్రసంగించారు. తమ్మిడికుంటను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. తమ పిల్లలతో ఇక్కడికి వచ్చే కుటుంబాలు, బాలికల పూర్తి భద్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఐటీ కారిడార్లోని శిల్ప ఉద్యానవనంతో పాటు, ఇప్పుడు తమ్మిడికింట కూడా సందర్శకులకు ఒక మంచి ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
ఆక్రమణల కారణంగా 14 ఎకరాలకు కుంచించుకు పోయిన ఈ సరస్సును హైడ్రా 30 ఎకరాలకు విస్తరించి, అభివృద్ధి చేసిన తీరు పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు ఎకరాల భూమిని దానం చేసి సహాయం చేసిన నటుడు అక్కినేని నాగార్జునను ప్రశంసించారు. ఆయన కేవలం తెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరో అని కొనియాడారు. తమ్మిడికుంట వచ్చే సందర్శకులు సరస్సు చుట్టూ నడుస్తూ.. వ్యాయామం చేస్తూ.. వెళ్లే ముందు కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలు కొనుగోలు చేసేలా, ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసి వాటిని స్వయం సహాయక బృందాల మహిళలకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విధంగా సరస్సులను మహిళా సాధికారతకు ఒక వేదికగా నిలిపి, సరస్సు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. తమ్మిడికుంట సరస్సు వద్ద దసరా, సంక్రాంతి వేడుకలు జరుపు కోవాలని, అక్కడ ఒక జమ్మి చెట్టును నాటాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రకృతిని కాపాడటమే నా లక్ష్యం. హైదరాబాద్లో కనుమరుగైన లేదా నిర్లక్ష్యానికి గురైన చెరువులన్నింటినీ మేము పునరుద్ధరిస్తాం అని ప్రకటించారు రేవంత్ రెడ్డి.


















