వాషింగ్టన్ : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మరోసారి ఇరాన్ పై బాంబు పేల్చారు. మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. యుద్ధాల వల్ల ఇంధన మార్కెట్లు, నౌకాయాన మార్గాలు, సరఫరా గొలుసులు, ఆర్థిక వ్యవస్థలు దెబ్బ తింటున్నాయని, తద్వారా సామాన్య ప్రజల కుటుంబాలపై ప్రభావం పడుతోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ పేర్కొన్నారు. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు. అదే సమయంలో ఈ యుద్ధం వల్ల రాబోయే కాంగ్రెషనల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా కొంత మూల్యం చెల్లించు కోవాల్సి రావచ్చునని ఆయన అంగీకరించారు. ఈ సంఘర్షణ ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ప్రభావం చూపిందని అడిగినప్పుడు, తన నిర్ణయంపై అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
అయితే ఇరాన్ అణు ఆయుధాన్ని పొందకుండా అడ్డుకోవడానికి ఈ చర్య అవసరమని ఆయన సమర్థించుకున్నారు. వాషింగ్టన్ నుండి బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే, గత అధ్యక్షులు చేయాల్సిన పనిని నేను చేస్తున్నాను కాబట్టి ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నారని చెప్పారు. మరో రకంగా చూస్తే కొందరికి ఇది నచ్చకపోవచ్చు అని అన్నారు. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే దీనికి కొంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నాకు తెలుసు, కానీ ఇరాన్ అణు ఆయుధాన్ని కలిగి ఉండటాన్ని మనం అనుమతించలేం అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏదైనా సైనిక చర్య చేపట్టాలని ఆలోచిస్తున్నారా, లక్ష్యాలు ఏమిటి లేదా ఎప్పుడు చేపడతారు అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌తో యుద్ధంలో మనం వారికి గట్టి దెబ్బ ఇచ్చాం, బహుశా మరికొంత చర్య కూడా తీసుకోవచ్చు అని ఆయన అన్నారు.
















