హైదరాబాద్ : రాష్ట్రంలోని విఆర్ఏలు , ఇమామ్లు-మౌజంలు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. వేలాది కుటుంబాలు, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విఆర్ఏల సమస్యలపై మాట్లాడుతూ కుటుంబ సభ్యులు వంతుల వారీగా విధులు నిర్వహించిన కారణంగా ఉద్యోగాల కేటాయింపులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,797 కుటుంబాలు ఈ సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై 479 మంది బాధిత విఆర్ఏలు హైకోర్టులో 11 రిట్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయక పోవడంపై ప్రశ్నించారు. బాధిత విఆర్ఏలకు తక్షణమే న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
అనంతరం ఇమామ్లు, మౌజంల గౌరవ వేతనాల అంశాన్ని ప్రస్తావించారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లెక్కల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని విమర్శించారు. 2024-25లో గౌరవ వేతనాల కోసం రూ.106 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, 2026-27 నాటికి కేటాయింపులను కేవలం రూ.40 కోట్లకు పరిమితం చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,845 మంది ఇమామ్లు, మౌజంలకు గత మూడు నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం కేటాయించిన నిధుల్లో భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా ఉంచారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇమామ్లు, మౌజంల గౌరవ వేతనాన్ని రూ.10 వేల వరకు పెంచాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల మొదటి తేదీన గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలపై ప్రస్తావించారు. జీవో నంబర్ 97 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి పాలిటెక్నిక్ వ్యవస్థను తీసుకు రావడం వల్ల భవిష్యత్తులో స్కాలర్షిప్లు నిలిచి పోవడం, ఫీజులు పెరగడం, అధ్యాపకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై వందలాది మంది విద్యార్థులు తనకు వినతిపత్రాలు అందజేశారని వెల్లడించారు.

















