విశాఖపట్నం జిల్లా : ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. వియత్నాం ట్రావెల్ అసోసియేషన్ ఆపరేటర్లతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇన్-బౌండ్ టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా వియత్నాం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సన్ పొకాకో ఎయిర్‌లైన్స్ సర్వీసులు నడిపేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించి ఈ అంశంపై త్వరలోనే ముందడుగు వేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఓపెన్ స్కై ఎయిర్‌పోర్ట్ గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, రాష్ట్ర పర్యాటకాన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
హాలిడే వరల్డ్ ప్రతినిధులతో జరిగిన భేటీలో వారు ‘ట్రైబల్ సర్కిల్’ ప్యాకేజీలను మంత్రికి వివరించారు. గిరిజన సంస్కృతి, జీవన విధానం ప్రతిబింబించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా జి.ఆర్.టి హోటల్స్, ది పార్క్, ఐటీసీ , తాజ్ గ్రూప్, రాడిసన్ బ్లూ, నోవోటెల్, లేక్ ప్యాలెస్, లెమన్ ట్రీ, బెస్ట్ వెస్ట్రన్ ప్లస్, ఫార్చ్యూన్, జింజర్, రాయల్ పోర్ట్, గాదిరాజు ప్యాలెస్, డాల్ఫిన్, గ్రీన్ పార్క్ తదితర హోటల్ గ్రూప్‌ల ప్రతినిధులతో పాటు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు , పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు, అనుసంధానం కోసం ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి సహకారం, రాయితీలు అందిస్తామని హామీ ఇచ్చారు.
పర్యాటక రంగ వృద్ధి వేగవంతం, ఏఐ సాంకేతికత ఆధారిత టూర్ ఆపరేటింగ్, విధాన నిర్ణయాలు , సందర్శకుల నిర్వహణ ద్వారా సుస్థిర పర్యాటకం సాధించడం తదితర అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి.
















