అమరావతి : రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించేలా కేంద్రం సంప్రదింపులు జరపాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర సర్కార్ ను కోరారు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యలపై 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని అమెరికా విధించిందని అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వేసేందుకు ఆలోచన చేస్తోందని సీఎం తెలిపారు. అమెరికా అధ్యక్షుడి రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 80 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని, రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తే రాష్ట్రంలోని 30 లక్షల మంది ఆక్వా కల్చర్ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు.
అమెరికాకు చేసే రొయ్య ఎగుమతులను కాపాడేందుకు సీఫుడ్పై ప్రస్తుతం ఉన్న 30% కస్టమ్స్ సుంకాన్ని సున్నాకు తగ్గించాలని లేదా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దానిని మినహాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు అంతర్జాతీయంగా వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం గుర్తించాలని సీఎం కోరారు. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను శ్లాబులో ఉంచటం పొగాకు రైతులపై నేరుగా ప్రభావం చూపిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రికి సీఎం వివరించారు. సిగరెట్లపై భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం పై జీఎస్టీని లెక్కించటం భారమైనట్టు పరిశ్రమ వర్గాలు ఆందోళన చేస్తున్నాయని అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని తయారీ దారులు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో వేలం పాటల్లో పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు.
















