హైదరాబాద్ : తెలంగాణలో క్రికెట్ పట్ల టీజీ20 సీజన్-1 కొత్త ఉత్సాహాన్ని నింపేలా చేసిందన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, తమ మద్దతును అందించిన స్పాన్సర్‌లకు హృదయపూర్వక అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు. పాల్గొన్న అన్ని జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి, టోర్నమెంట్‌ను విజయవంతం చేశారంటూ ప్రశంసించారు. ఇలాంటి వేదికలు గ్రామీణ ప్రాంతాల్లోని యువ ప్రతిభను వెలికితీసి, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయని తాను గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు.
ఉత్కంఠ భరితమైన ఫైనల్‌లో విజేతలుగా నిలిచిన హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. రన్నరప్‌గా నిలిచిన ఖమ్మం ఏసెస్ జట్టు కూడా అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని, ఈ రెండు జట్లకు నా ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు మల్లు భట్టి విక్రమార్క . క్రికెట్‌ను ప్రోత్సహిస్తూ, తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రతిభను పెంపొందించడానికి ఒక విలువైన వేదికను అందించే టోర్నమెంట్‌ను నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి క్రికెటర్ టోర్నీలు నిర్వహించేలా ప్లాన్ చేయాలని కోరారు. ప్రభుత్వ పరంగా క్రీడాభివృద్దికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క.

















