హైదరాబాద్ : ప్రశ్న పేరుతో సంచలనంగా మారిన రావణ్ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు తన భర్త బచ్చలకూర అనూష. ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా స్వంతంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో. అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించు కునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారని, వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు బచ్చలకూర అనూష.
రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం అని పేర్కొన్నారు. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి, నాభర్తది “కమ్మ కులం”. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుగా నిలవడమే రావణ్ పార్టీ. అదే వర్గానికి చెందిన రావణ్.
సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌ది తప్ప, ఏ ఒక్కరినీ కించ పరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి, లేదంటే లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకాని, ఇలా చట్ట వ్యతిరేకంగా నడుచు కోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికే రావణ్‌ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు బచ్చలకూర అనూష.
ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు. కానీ నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్య వాదులంతా రావణ్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బచ్చలకూర అనూష.

















