బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, జేడీఎస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. తీవ్రమైన అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రకు ఎలా మంత్రి పదవిని కేటాయిస్తారంటూ ప్రశ్నించాయి. ఆపై ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు మంత్రి నాగేంద్ర. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు . తన రాజీనామా వార్తలను ఖండించారు. ప్రస్తుతం ప్రణాళిక, గణాంక శాఖ మంత్రిగా ఉన్నారు. తను ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కలిశారన్న ఊహాగానాలు చెలరేగడం పట్ల అభ్యంతరం తెలిపారు నాగేంద్ర. పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.
కాగా పార్టీ నాయకత్వాన్ని ఇకపై ఇబ్బంది పెట్టకూడదని భావించిన నాగేంద్ర ఇవాళ సాయంత్రం నాటికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు శివకుమార్‌కు చెప్పారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఖండిస్తూ నాగేంద్ర ఇలా అన్నారు. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నాకు ఎటువంటి పిలుపు రాలేదు, అలాగే రాజీనామాకు సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదని కుండ బద్దలు కొట్టారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి. కర్ణాటక హైకోర్టు కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థలో రూ. 89 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, మంత్రివర్గం నుండి నాగేంద్రను తొలగించాలని ప్రతిపక్ష బీజేపీ , దాని మిత్రపక్షం జెడి(ఎస్) డిమాండ్ చేస్తున్నాయి. దీంతో నిర్ణీత గడువుకు మూడు రోజుల ముందే, ఆగస్టు 24న సభ నిరవధికంగా వాయిదా పడింది.

















