అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో లీప్ మోడల్ విద్యా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్ లో శిక్షణ పొందిన టీచర్లు ఇతర టీచర్లకు మెంటరింగ్ చేయాలన్నారు. ప్రధానంగా విద్యార్థులు, టీచర్లకు మధ్య మంచి సంబంధాలు ఉండాలని, ఇదంతా సబ్జెక్టును కూలంకుషంగా బోధించినప్పుడే సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం మనం మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టి, సాఫ్ట్ వేర్ మర్చిపోతున్నాం అ న్నారు. రాష్ట్రంలో లీప్ మోడల్ విద్యావ్యవస్థ సాధనకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. టీచర్లు బోధనపైనే శ్రద్ధ వహించాలని అన్నారు. విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు తేవడం వెనువెంటనే సాధ్యం కాదని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు నారా లోకేష్.
రాష్ట్రంలో మనం చేపట్టిన సంస్కరణల కారణంగా ఈ ఏడాది లక్షమందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారని చెప్పారు. ఇది శుభపరిణామం, ప్రభుత్వ ఉపాధ్యాయులకు మించిన టీచర్లు ప్రైవేటు స్కూళ్లలో లేరు, ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థ (ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్) సాధనకు మీ సహకారం కావాలని కోరారు లోకేష్, కలిసికట్టుగా పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి, లక్షలాది మంది బిడ్డల భవిష్యత్తు మనపై ఆధారపడి ఉందని, ఆ విషయం మరిచి పోవద్దన్నారు.
ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ గురించి చర్చ జరుగుతోందని అన్నారు. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఎటువంటి పైరవీలకు తావు లేకుండా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా ప్రమోషన్లు ఇచ్చాం అన్నారు.


















